ఎస్బిఐ ఖాతాదారులకు శుభవార్త
న్యూస్ ఫోర్స్,దిల్లీ: ప్రభుత్వ రంగ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) ఖాతాదారులకు మరో శుభవార్త చెప్పింది. పొదుపు ఖాతాల్లో కనీస బ్యాలెన్స్ నిబంధనను ఎత్తివేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బ్యాంక్ ఓ ప్రకటనలో తెలిపింది. అంతేగాక, పొదుపు ఖాతాలపై వడ్డీరేట్లను కూడా హేతుబద్దీకరించింది. ఇకపై ఏడాది కాలానికి 3శాతం వడ్డీ ఇవ్వనున్నట్లు తెలిపింది.
ఎస్‌బీఐ 2018 ఏప్రిల్ నుంచి కనీస బ్యాలెన్స్ నిబంధన తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. పట్టణ ప్రాంతాల్లోని ఎస్‌బీఐ ఖాతాదారులు తమ ఖాతాల్లో కనీసం రూ. 5వేలు ఉంచాలని, లేదంటే పెనాల్టీ ఛార్జీలు వసూలు చేస్తామని స్పష్టం చేసింది. అయితే దీనిపై వినియోగదారుల నుంచి వ్యతిరేకత రావడంతో గతేడాది అక్టోబరులో ఈ నిబంధనల్లో కొంత మార్పులు చేసింది. పట్టణ ప్రాంతాల్లోని ఖాతాదారులకు కనీస బ్యాలెన్స్ పరిమితిని రూ. 5వేల నుంచి రూ. 3వేలకు తగ్గించింది. మెట్రో, సెమీ అర్బన్ ప్రాంతాల్లో రూ. 2వేలు, గ్రామీణ ప్రాంతాల వారికి రూ. 1000 కనీస బ్యాలెన్స్ తప్పనిసరి చేసింది. అంతకుముందు రుణాలు, డిపాజిట్లపై ఎస్‌బీఐ వడ్డీరేట్లను తగ్గించిన విషయం తెలిసిందే.