బీసీలకు తీరని అన్యాయంచేసిన వైసీపీ
న్యూస్ ఫోర్స్,సర్వేపల్లి: రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతో బీసీలకు తీరని అన్యాయం జరుగుతోందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా అధికారులు అర్ధరాత్రి వేళలో విడుదల చేసిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ రిజర్వేషన్ల జాబితాలు అస్తవ్యస్తంగా, తప్పులు తడకగా ఉన్నాయని ఆయన ధ్వజమెత్తారు.రిజర్వేషన్లలో కోత పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమేనని ,బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించకుండా కేంద్ర నిధుల కోసమంటూ హడావుడిగా ఎన్నికలు వెళ్లడమంటే వారి గొంతు కోయడమేనన్నారు. ఇస్తుందే అరకొర రిజర్వేషన్లయితే నెల్లూరు జిల్లాలో అందులోనూ మరింత కోత విధించారని ఆయన మండిపడ్డారు. జిల్లాలో 46 జెడ్పీటీసీలుంటే బీసీలకు కేవలం 6 మాత్రమే రిజర్వ్ చేశారని, 562 ఎంపీటీసీలకు గాను 59 మాత్రమే కేటాయించారని వివరించారు. ఎంపీటీసీల్లో 11 శాతం కంటే తక్కువగానే వారికి అవకాశం కల్పించారన్నారు. 15 మండలాల్లో బీసీలకు ఒక్క ఎంపీటీసీ స్థానం కూడా కేటాయించలేదని, మరికొన్ని మండలాల్లో ఒకటి, రెండు స్థానాలతో సరిపెట్టారన్నారు. ఇది ఖచ్చితంగా రాజ్యాంగ విరుద్ధమేనని ఆయన పేర్కొన్నారు. ఇంత ఘోరంగా రిజర్వేషన్ల జాబితా ఎలా రూపొందిస్తారని సోమిరెడ్డి ప్రశ్నించారు. ఈ రిజర్వేషన్లతోనే ఎన్నికలు నిర్వహిస్తామంటే అంత కంటే వైఫల్యం ఉండదన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బీసీల గొంతుపై కత్తి పెట్టి ఎన్నికలు నిర్వహించాలని చూస్తోందన్నారు. ఎన్నికల సంఘం, జిల్లా అధికారులు వెంటనే స్పందించి పొరపాట్లను సరిదిద్ది నిర్ణీత దామాషా ప్రకారం రిజర్వేషన్లు కేటాయించాలని కోరారు. లేనిపక్షంలో తీవ్ర పరిణామాలను చవిచూడాల్సివస్తోందని హెచ్చరించారు.#ఎస్పీన్యూస్#