ఆదివారాల్లో మాంసపు కొట్లు బంద్

ఆదివారాల్లో మాంసపు కొట్లు బంద్
                   - కమిషనర్  మూర్తి



న్యూస్ ఫోర్స్,నెల్లూరు: కరోనా వైరస్ వ్యాప్తిని నివారించేందుకు తీసుకుంటున్న ముందస్తు చర్యల్లో భాగంగా నగరంలోని అన్ని మాంసపు దుకాణాలను ప్రతీ ఆదివారం నాడు మూసివేసేందుకు నగర మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ పివివియస్ మూర్తి ఆదేశాలు జారీ చేశారు.మిగిలిన రోజుల్లో భౌతిక దూరం పాటించకుండా విక్రయాలు జరిపే దుకాణాలపై భారీ జరిమానా విధించి, సరుకును జప్తు చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ మేరకు సోమవారం ఒక పత్రికా ప్రకటనను ఆయన విడుదల చేశారు. ప్రజల మధ్య భౌతిక దూరం పాటించకుండా మాంసపు దుకాణాల్లో నిర్లక్ష్యంగా జరుగుతున్న విక్రయాలపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయని, జిల్లా కలెక్టర్ శేషగిరిబాబు సూచనల మేరకు పై ఆదేశాలను పటిష్టంగా అమలు చేస్తామని ఆయన స్పష్టం చేసారు. ప్రభుత్వ మార్గదర్శకాల ద్వారా ఏర్పాటు చేసిన కూరగాయల విక్రయ కేంద్రాలలో ప్రజలు పాటిస్తున్న భౌతిక దూరం నిబంధనలు అన్ని మాంసపు విక్రయ కేంద్రాల్లో సైతం అమలయ్యేలా ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తామని కమిషనర్ పేర్కొన్నారు. వరుసగా మూడు ఆదివారాలపాటు ఈ నిబంధన అమలులో ఉంటుందని, నిబంధన కొనసాగింపు తదుపరి ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని ఆయన తెలిపారు.#ఎస్పీన్యూస్#